జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24 | National Girl Child Day
జాతీయ బాలికా దినోత్సవం ( జనవరి 24 ) సందర్భంగా
భారతదేశంలో 2008 సం.నుంచీ, ప్రతిసంవత్సరం జనవరి 24న బాలికా దినోత్సవంనిర్వర్తిస్తున్నారు. భారత దేశపు మొదటి మహిళా ప్రధానిగా శ్రీమతి ఇందిరా గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును పురస్కరించుకొని, రాష్ట్రపతిగా శ్రీమతి ప్రతిభా పాటిల్ పదవిలో ఉండగా దీన్ని ప్రారంభించారు. వివిధ దేశాలలో బాలికలకోసం ప్రత్యేకంగా ఒక రోజుని కేటాయించినా, ఇక్కడ ఆ విధానం లేకపోవడాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం, బాలికల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పరిష్కార దిశగా అందరూ కృషి చేయాలనే ఉద్దేశంతో దీన్ని మొదలు పెట్టేరు. ఆడపిల్లలకు ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం, రక్షణ, భద్రత, కల్పించి, విద్యా, ఉపాధి రంగాలతో సహా అన్నిటా సమాన అవకాశాలు కల్పించి, వివక్షను అంతం చేయడమే ఈ బాలికాదినోత్సవం ఉద్దేశం.
మానవజాతి అనంత విశ్వంలో ఏకాకిగా ఉన్నట్లు భావిస్తూ, నివాసం కోసం, అన్య గ్రహ వాసులతో సంబంధాలకోసం విశ్వాంతరాళాన్ని జల్లెడ పడుతున్న వర్తమానంలో కూడా, మన సమాజానికి లింగవివక్ష పెద్ద సమస్యగా మారింది. భూగోళంపై మిగతా ప్రాంతాలకంటే భారత దేశలో సాంస్కృతికంగా, మత నమ్మకాల పరంగా, ఈ వివక్ష తరాలుగా కొనసాగుతోంది. బాలికల్ని పిండంగా ఉండగానే చంపడం దురాచారంగా మారింది. లింగ నిర్ధారణ పరీక్షలను 1994సం. లో చట్టప్రకారం అధికారికంగా నిషేధించినా, నిరంతరంగా అనధికారికంగా కొనసాగుతూనే ఉన్నట్లు వార్తలద్వారా తెలుస్తోంది. దీనిఫలితంగా దేశంలో మహిళల నిష్పత్తి 'నానాటికీ తీసికట్టు నాగంభట్టు' అన్నట్లుగా, ప్రతి జనగణన లోనూ క్షీణిస్తూవస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతకు ముందు 2011సం. లో జరిగిన జనాభా లెక్కల సూచీ ప్రకారం ప్రతి వెయ్యిమంది పురుషుల జనాభాకూ కేవలం తొమ్మిదివందల నలభైమంది స్త్రీలు మాత్రమే ఉన్నారు.
బాలికలపై తరాలుగా ఎంతో వివక్ష కొనసాగుతూవస్తున్నది. చిన్నతనం నుంచీ ఆహారం విషయంలోనూ, పని చెప్పే విషయంలోనూ, ఆంక్షలు విధించడంలోనూ, విద్యావకాశాలు కల్పించడంలోనూ బాలికల్ని వివక్షకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి సంస్కృతిలో మగపిల్లలపట్ల మాత్రమే శ్రద్ధవహించడం జరుగుతోంది. దీనికితోడు శారీరక మానసిక అవమానాల సంగతి చెప్పే పనే లేదు. చిన్నారులపై రోజూ లైంగిక దాడులు, అత్యాచారాలూ పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ప్రతి పదిహేను నిమిషాలకూ ఒక చిన్నారి అత్యాచారానికి గురవుతున్నట్లు 'చైల్డ్ రైట్స్ అండ్ యు' అనే సంస్థ తెలిపింది. అనేక పరిశీలనల ప్రకారం, ఎక్కువగా తెలిసినవారు, పరిచయస్థులే పిల్లలపై ఇట్లాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. వీటిని అరికట్టడానికి 2012లో పోక్సో చట్టంగా ప్రచారంలో ఉన్న ' లైంగిక నేరాలనుంచి పిల్లలకు రక్షణ చట్టం' తయారు చేశారు. ఈ చట్టం పిల్లలపై జరిగే లైంగిక నేరాలపట్ల చాలాకఠినంగా వ్యవహరించే నిబంధనలతో ఉంది. 'సేవ్ గర్ల్ చైల్డ్ ' అనే సంస్థ విడుదల చేసిన గణాంకాలలోని వివరాల్లో కొన్నిటి ప్రకారం భారత దేశంలో ఆడపిల్లల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
భారత దేశంలో ఏటా ఇరవయ్యేడు లక్షలమంది పిల్లలు మరణిస్తుండగా, వారిలో అత్యధికంగా ఆడపిల్లలే ఉంటున్నారు. ఐదు సంవత్సరాలనుంచి, తొమ్మిదేళ్లలోపు వయసున్న బాలికలలో యాబైమూడు శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని 2006 లో తెచ్చారు. ఈ చట్టంలోని అంశాల ప్రకారం పద్దెనిమిదేళ్లు నిండని బాలికకు వివాహం చేయడం నేరం. ఈ చట్టం, ఇరువైపులా పెద్దమనుషులు, వివాహం చేసుకున్నవారు, చేయించినవారితోసహా శిక్షార్హులవుతారని నిర్దేశించింది. కానీ ఆచరణలో ఈ చట్టం ఘోరంగా విఫలమైన స్థితి మన కనులముందు నగ్నంగా కనబడుతూనే వుంది. వివాహమైన స్త్రీలలో నూటికి డెబ్బైఅయిదుమందికి బాల్యంలోనే వివాహాలు జరిగేయి. ప్రతి ఇద్దరు బాలికలలో ఒకరు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. ఏటా కోటి ఇరవై లక్షలమంది ఆడపిల్లలు పుడుతుండగా, వారిలో పదిలక్షలమంది సంవత్సరం నిండకుండానే చనిపోతున్నారు. సామాజిక సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్న లింగ వివక్ష కారణంగా, ప్రతి ఆరుగురు బాలికలలోనూ ఒకరు చనిపోతున్నారు.
ఈ రకమైన స్థితిగతులు సామాజికంగానూ, ఆర్థికంగానూ చాలా దుష్ఫలితాలకు కారణమౌతాయి. లింగ నిష్పత్తిలో అసమానత వల్ల వివాహానికి స్త్రీలు దొరకడం కష్టం కావడం, తద్వారా లైంగికనేరాలు పెరగడం వంటి స్థితికి దారితీయడమౌతోంది. ఉపాధి రంగంలో స్త్రీలకు సమాన అవకాశాలలేమి, ఉన్న అవకాశాలకు అర్హతఉన్నవారు లభ్యం కాకపోవడం వంటి వాటివల్ల, మానవ వనరులలో సగంగా ఉన్న స్త్రీ శక్తిని ఉపయోగించుకోకపోవడం వల్ల, దేశ స్థూల జాతీయోత్పత్తికి నష్టం జరుగుతోంది. ఈ వివక్షను అంతం చేయాలంటే, ఉత్పత్తి, సేవారంగాలలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరగాల్సివుంది. అందుకై వారికి విద్య గరిపి సమాయత్తం చేయాలంటే, బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ బాలికలకు మరుగు దొడ్లు, నీటిసౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన తక్షణం ఏర్పాటు చేయాలి. తద్వారా బడి మానివేసే బాలికల శాతాన్ని గణనీయంగా తగ్గించి, హాజరు శాతం పెంచవచ్చు. ప్రస్తుతం ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పథకం, సర్వశిక్షా అభియాన్, తదితర కార్యక్రమాలు, పధకాల అమలుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో నిధులు కేటాయించాలి.
బాల్యం సక్రమంగా గడవాలంటే వారికి సరయిన భద్రత, ఆహారం, వైద్యం, విద్యా సౌకర్యాలు కల్పించాలి. అందుకు అనుగుణంగా ఎన్నో చట్టాలు తయారు చేశారు. ఇవి మాత్రం అవసరానికి మించిన సంఖ్యలో ఉన్నట్లు కనబడుతున్నాయి కానీ ఆచరణమాత్రంపూజ్యం. నిధుల కొరత, చట్టాలపై అవగాహనాలేమి, అమలుపరిచేవారిలో చిత్తశుద్ది లేకపోవడం వంటి ఎన్నో కారణాలు, చట్టాలు అమలులో వైఫల్యంకావడానికి దారి తీస్తున్నాయి. దీనికి తోడుగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు కావడం, జూదంగా మారిన వ్యవసాయం, కునారిల్లిన చేతి వృత్తులు, విపరీతంగా నానాటికీ పెరుగుతున్న సాంకేతిక సామర్ధ్యానికి అనుగుణంగా మార్పులు సంతరించుకోవడంలో విఫలమౌతున్న గ్రామీణ కుటుంబాల పేదరికం వంటివి బాలికల స్థితిని మరింతగా దిగజారుస్తున్నాయి. దేశంలో అనేక నూతన పారిశ్రామిక వాడలు, విమానాశ్రయాలు, నీటి ప్రాజెక్టులు, కొత్త గనులు వంటివాటికారణంగా నిరాశ్రయులై, పట్నంబాటపట్టి, జీవికలు చెల్లా చెదురై దుర్భరంగా మురికివాడలలో నివసిస్తున్న కుటుంబాలు లక్షలాదిగా ఉన్నాయి. ఇవన్నీ వారి జీవన విధానంలో, వివాహజీవితంలో, కుటుంబ జీవన సంబంధాల్లో పెనుమార్పులకు కారణమౌతున్నాయి. విఛ్ఛిన్నమౌతున్న మానవ సంబంధాలమధ్య ముఖ్యంగా బాలికల బతుకులు శారీరక లైంగిక హింసలతో సహా, అన్ని రకాల దోపిడికీ, హింసకూ బలవుతున్నాయి.
ఏదైనా సంచలనం రేపిన ఒక దారుణమో, హింసాత్మక సంఘటనో జరిగినపుడల్లా, పాలకులు కొత్తగా ఒక చట్టాన్ని చేసి ఏదో సాధించినట్లు రొమ్మువిరుచుకోవడమేగానీ, ఉన్న చట్టాల అమలుపట్ల ఏమాత్రం చిత్తశుద్ధి చూపడంలేదు. ప్రభుత్వం అమలు యంత్రాంగాన్ని పటిష్ట పరచడంలో , అవసరమైన నిధులు కేటాయించడంలో, పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దానికితోడుగా, చట్టాలు, పధకాలు, సహాయమూ అందించడాన్ని అమలు పరచడంలో క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందిలో అధికభాగం వ్యక్తులకు సామాజిక ఆధిపత్య సంస్కృతులకు అనుగుణంగా వర్తించడం తప్ప కనీసం చట్ట సమానత్వ భావనపై కూడా సరైన అవగాహన లేదనేది వాస్తవం. ఇక ఒక్కో పేరా ఒక్కో వాక్యంగా, అన్వయ క్లిష్టతతో ఉండే, కేవలం ఆంగ్లంలో మాత్రమే ఉండే చట్టాలు వారికి ఏమాత్రం అర్ధం కాని స్థితిని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. .
అమలు యంత్రాంగానికే కాదు. చట్టాలలో ఏముందనే అంశం సాధారణ ప్రజానీకానికి కూడా తెలిసేందుకు వీలులేని విధంగా ప్రజలకు అర్థం కాని ఆంగ్లంలో తయారు కావడం పెద్దలోపం. కాబట్టి తెలుగు రాష్ట్రాలలో కూడా అనేక ఇతర రాష్ట్రాలమాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాల్ని సరళమైన తెలుగు భాషలో ప్రజలకు అందించేందుకు పూనుకోవాలి.
దేశం సామాజిక ఆర్ధిక విద్యారంగాల్లో పురోగతి సాధించాలంటే, ముఖ్యంగా జనాభాలో సగంగా ఉన్న రేపటి మహిళలుగా ఎదిగే బాలికల పట్ల మానవీయ కోణాన్ని ప్రదర్శించే విధానాల్ని ప్రభుత్వం వివిధ మాధ్యమాలలో ప్రకటనలు, ప్రచారంద్వారా పెంపొందించాలి. వివిధ రకాలప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలూ వివిధ కళారూపాలూ, రచనలు, ఉపన్యాసాలు, తదితర కార్యక్రమాలద్వారా బాలికల సమస్యలపట్ల, అమలులో ఉన్న చట్టాల పట్ల, ప్రజానీకంలో అవగాహన కల్పించాలి. చట్టాల అమలుకు క్షేత్ర స్థాయిలో బాధ్యత వహించాల్సిన యంత్రాంగానికి తప్పని సరిగా అవగాహనా తరగతులు నిర్వహించాలి. ఈ బాలికా దినోత్సవ కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా, నిరంతర కార్యాచరణకు ప్రేరణగా నిలిచేట్లు పధకాలు రూపొందించేట్లు నిర్వర్తించాలి. సమాజపు నేలమాళిగల్లో ఊపిరాడక అల్లాడుతున్న చిన్నారుల కళ్ళలో వెలుగు నింపే సంకల్పానికి ఈ బాలికా దినోత్సవం ఊతమివ్వాలి.
Comments
Post a Comment