జాతీయ సైన్స్ దినోత్సవం | National Science Day | సీవీ రామన్ జీవిత చరిత్ర CV RAMAN Biography in Telugu
🔷జాతీయ సైన్స్ దినోత్సవం
National science day
February 28🔷
రామన్ ఎఫెక్ట్ అనే అంశం పై నేచర్ పత్రికలో సి.వి.రామన్ ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపడింది. 1930 డిసెంబర్‌లో రామన్ కు నోబెల్ బహుమతి ప్రకటింపబడింది. వీరికి భారతరత్న (1954) బహుకరింపబడింది. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్).
జాతీయ విజ్ఞాన దినోత్సవమును ఈ రోజునే సైన్స్ డే గా పేర్కొంటారు. ప్రతి ఏడది ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేను జరుపుకుంటారు. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి, ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా పేరుగాంచిన సీవీ రామన్‌గా ( ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్) 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. దీంతో ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు.
అంతే కాదు ఆయన చిన్నతనం నుంచి భౌతికశాస్త్రంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. 'నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా..' అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తిల్లో సర్ సీవి రామన్.
భౌతికశాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా ఆ తేదిని జాతీయసైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. 1888 నవంబరు 7 న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు రామన్ జన్మించారు.
విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన రామన్ చిన్ననాటి నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాలపై అమితాసక్తిని ప్రదర్శించేవారు. తండ్రి కూడా భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో దానిపై మరింత కుతూహలం పెంచుకున్నారు. తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించాడు. ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఆ సబ్జెక్టులో గోల్డ్ మెడల్ సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
పద్దెనిమిదేళ్ల వయసులో కాంతికి సంబంధించిన ధర్మాలపై రామన్ రాసిన పరిశోధనా వ్యాసాలు లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధనల పట్ల అయనకున్న అభిరుచిని గమనించిన అధ్యాపకులు ఇంగ్లాండు వెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఆయన ఆరోగ్యం ఇంగ్లాండు వాతావరణానికి సరిపడదని తేల్చడంతో ప్రయాణాన్ని విరమించుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఫైనాన్స్ విభాగంలో చేరిన సీవీ రామన్ 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు.
అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్‌కు రోజూ వెళ్లి పరిశోధనలు చేసుకునేవారు. రామన్ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ బ్రిటీష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రామన్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని ఆ లేఖలో సూచించారు. అయితే బ్రిటీష్ ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన రామన్ పరిశోధనలపై పూర్తిస్థాయి సమయాన్ని వెచ్చించాడు.
ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఒకసారి కలకత్తాలో వీధుల్లో తిరుగుతుండగా బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూశాడు. ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు.
అతని తల్లి పార్వతి అమ్మాళ్ వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం లాంటి సంగీత వాయిద్య పరికరాలపై సాగింది. విజ్ఞాన పరిశోధనలపై తృష్ణతో ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై 1921లో లండన్‌లో ఉపన్యాసాలు ఇచ్చాడు. శ్రోతల్లోని ఓ వ్యక్తి ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా అంటు హేళన చేశాడు.
దీంతో రామన్‌కు పరిశోధనలపై మరింత పట్టుదల పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతివైపు మళ్లించాడు. ఇంగ్లాండు నుంచి తిరిగొస్తూ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలిరంగులో ఉండటాన్ని ఆసక్తితో గమనించాడు. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలం రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడటం కాదని.... సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించాడు.
కలకత్తా చేరుకోగానే తన ప్రాకల్పనలను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాల కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 ఏడాదికి భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందిన కాంప్టన్ ఎక్స కిరణాలు పరిశోధననిజమైనపుడు, కాంతి విషయంలోనూ నిజం కావాలంటూ ఆలోచనలో పడ్డాడు.
ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. అధునాతనమైన పరికరాలు లేకపోయినా తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్న రామన్ అనుకున్నట్లుగానే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నాడు. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించాడు. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వెళ్లడించాడు.
దీంతో బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో రామన్‌ను సత్కరించింది. రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైందని కేవలం రూ.200 కూడా విలువలేని పరికరాలతో దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైందని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ కొనియాడారు. ఈ పరిశోధనను గుర్తించిన రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతికశాస్త్రానికి 1930లో నోబెల్ బహుమతి ప్రధానం చేసింది. సైన్స్‌కు చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్దికై పాటుపడ్డ ఆయన 1970 నవంబర్ 21 కన్నుమాశారు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి.
Comments
Post a Comment